బాలీవుడ్‌లో రష్మికా మందన్నా

కథానాయికగా రష్మికా మందన్నా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇలా వరుస హిట్లతో దూసుకెళుతున్న రష్మికా ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టడం ఏంటీ? అనుకోవచ్చు. అయితే ఈ జర్నీ హిందీ సినిమాకి సంబంధించినది. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’ అనే సినిమాలో కథానాయికగా నటించనున్నారు రష్మికా. ‘‘మీ అందరికీ ఓ న్యూస్‌ చెప్పబోతున్నాను. కొత్త ప్రయాణం ఆరంభమైంది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అని హిందీలో తొలి సినిమా అంగీకరించిన సందర్భంగా రష్మిక పేర్కొన్నారు.

భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో శాంతను బాగ్చి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరో. ‘‘దేశ పౌరులను రక్షించడానికి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గూఢచారులను స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఇండియా–పాకిస్తాన్‌ మధ్య ఓ మిషన్‌ను విజయవంతం చేసే ‘రా ఏజెంట్‌’ పాత్రను చేస్తున్నాను’’ అన్నారు సిద్ధార్థ్‌. సినిమాలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక రష్మికా బాలీవుడ్‌ ఎంట్రీపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంట్రీయే దేశభక్తి సినిమాతో అంటే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మంచి లాంచింగ్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, ‘పొగరు’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు రష్మికా మందన్నా.