తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక

అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది కన్నడ భామ రష్మిక. కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ అల్లరి భామ అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’లో నటిస్తుంది. ఇలా తెలుగులో దూసుకెళ్తూనే కోలివుడ్‌పై కన్నేసింది ఈ కన్నడ బ్యూటీ. ఇటీవల కార్తీ నటించిన ‘సుల్తాన్‌’ సినిమా ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటీకీ.. రష్మిక పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాట్లాడుతూ.. తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడ ప్రజలు, సంప్రదాయం తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పింది. ముఖ్యంగా అక్కడి వంటకాలు అంటే అమితమైన ఇష్టమని చెప్పుకొచ్చింది. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని మనసులోని మాటను బయటపెట్టింది. మరి రష్మిక కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.