రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు సమర్పిస్తుండగా, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఒక చిన్న షెడ్యూల్ మినహా ‘విరాటపర్వం’ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మిగిలిన పోర్షన్‌కు సంబంధించి ఇటీవలే షూటింగ్ పునఃప్రారంభమైంది. రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు. ఒక విభిన్న తరహాతో, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో ఇప్పటివరకూ తాము పోషించని తరహా పాత్రలను రానా, సాయి పల్లవి పోషిస్తున్నారు.
ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు.