అభిమానులకు షాక్ ఇచ్చిన రజనీకాంత్

చెన్నై,తీస్మార్ న్యూస్:రజనీకాంత్ అంటే ఓ స్టైల్,ఆయన నడకతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు పార్టీ పెడుతున్నాడంటే అందరూ ఎదురు చూస్తూ ఉండడం సర్వసాధారణం.కానీ ఆయన మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చాడు “నా ఆరోగ్యం బాగాలేదు.. పార్టీ పెట్ట‌లేను” అని కోట్లాది మంది అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసే మాట ర‌జ‌నీకాంత్ చెప్పిన‌ప్పుడు చాలా మందికి ఆయ‌న సినిమాలోనే ఒక డైలాగ్ గుర్తొచ్చింది.దేవుడు శాసించాడు.. అరుణాచ‌లం పాటించాడు అని. ఇప్పుడు తాను రాజకీయ పార్టీ పెట్ట‌క‌పోవ‌డానికి విచిత్రంగా ఇదే కారణం చెప్పాడు ర‌జ‌నీకాంత్‌. మొన్న హైద‌రాబాద్‌లో తాను అనారోగ్యానికి గురికావ‌డం అనేది ఆ దేవుడు చేసిన హెచ్చ‌రికే అని.. అందుకే తాను పార్టీ పెట్ట‌డం లేద‌ని చెప్పి ఉసూరుమ‌నిపించాడు.

మూడు సంవత్సరాలు నాన్చి

తాను ఓ రాజ‌కీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్న‌ట్లు 2017, డిసెంబ‌ర్ 31న ర‌జ‌నీ ప్ర‌క‌టించడంతో ఆయ‌న అభిమానుల ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి. అది కూడా జ‌య‌ల‌లిత చ‌నిపోయిన కొన్ని రోజుల‌కే ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ స‌మ‌యంలో డీఎంకే అధినేత క‌రుణానిధి కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఇంకేం.. ఆయ‌న రావ‌డం, సీఎం అయిపోవ‌డ‌మే త‌రువాయి అన్న‌ట్లుగా అభిమానులు ఊహాలోకాల్లో విహ‌రించారు. ఇదిగో వ‌చ్చేస్తాడు.. అదిగో పార్టీ పెట్టేస్తాడు.. అంటూ ఎదురు చూస్తూ వ‌చ్చారు. మ‌ధ్య మ‌ధ్య‌లో మీటింగులంటూ ఆయ‌న హ‌డావిడి చేయ‌డం.. త‌ర్వాత చ‌డీచ‌ప్పుడూ లేకుండా ఊరుకోవ‌డం.. మూడేళ్లుగా ఇదే జ‌రిగింది.

స్క్రిప్ట్ కూడా రెడీ

ఈ ఏడాది మొద‌టి నుంచీ పార్టీ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడు ర‌జ‌నీ. మార్చి నెల‌లో మీడియాతో మాట్లాడుతూ.. త‌న పార్టీ బంతిని ప్ర‌జ‌ల కోర్టులోకి నెట్టాడు. ప్ర‌జ‌లు ఓ తిరుగుబాటు చూపించాల‌ని కోరాడు. 1967లో కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి డీఎంకే ఎలా అయితే అధికారంలోకి వ‌చ్చిందో అలాంటి తిరుగుబాటు కావాల‌ని అడిగాడు. తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకోవ‌డం లేద‌ని, రాజ‌కీయాల్లోకి రావాల‌ని యువ‌త‌ను ప్రోత్స‌హిస్తాన‌ని చెప్పాడు. ప్ర‌జ‌ల్లో తాను కోరిన తిరుగుబాటు వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తాన‌ని, కేవ‌లం ఓట్లు చీల్చే వ్య‌క్తిగా మిగిలిపోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌నీ అన్నాడు.

సమయం ఆసన్నమైంది

ఓవైపు త‌న స‌హ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ పెట్టేసి ప్ర‌చారంలోకి కూడా దిగిన స‌మ‌యంలో.. చివ‌రికి తాను కోరిన‌ట్లు ప్ర‌జ‌ల్లో ఎలాంటి తిరుగుబాటు కూడా లేని వేళ‌.. అక్టోబ‌ర్ చివ‌ర్లో ఇక టైమ్ వ‌చ్చేసింది.. డిసెంబ‌ర్ 31న పార్టీ ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్లు ర‌జ‌నీ ప్ర‌క‌టించాడు. అంతేకాదు తాను ఆధ్యాత్మిక రాజ‌కీయాలు చేస్తాన‌నీ చెప్పాడు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా అవినీత ర‌హిత రాజ‌కీయాలు చేస్తాన‌నీ అన్నాడు. అంత‌లోపే ర‌జనీ పార్టీ పేరు ఇదీ.. గుర్తు కూడా ఖ‌రారైందీ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఇక ఈసారి ఆయ‌న పార్టీ పెట్ట‌డం ఖాయం.. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డమూ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు. ఆయ‌న వ‌స్తే త‌మిళ‌నాడులో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎలా మార‌తాయి.. ర‌జనీ ఎవ‌రితో అయినా చేతులు క‌లుపుతారా? ఒంటరిగా పోటీ చేస్తారా? అస‌లు ఆయ‌న ప్ర‌భావం ఎలా ఉండ‌బోతోంద‌న్న విశ్లేష‌ణ‌లూ జ‌రిగాయి. ఇంతా చేసి చివ‌రికి దేవుడు హెచ్చరించాడంటూ అభిమానుల‌ను ఉసూరుమనిపించాడు.