నెటిజన్ల కామెంట్స్‌కు ప్రియాంక చురకలు

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తూనే హాలీవుడ్‌లో నటించే చాన్స్‌ కొట్టేసింది. ఈ క్రమంలో ఆమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక వయసు 38 ఏళ్లు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం ఆమెరికాకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే హాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఇటీవల అక్కడి యాహు లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అయితే తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ప్రియాంక సోషల్‌ మీడియాలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య నెటిజన్లు మరింత రెచ్చిపోయి తన శరీరాకృతిని ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఈ కామెంట్స్‌పై స్పందిస్తూ. ‘అవును నేను ఇది ఒప్పుకుంటాను. వయసు పెరుగుతున్న క్రమంలో నా శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను మానసికంగా స్వీకరించేందుకు నాకు నేనుగా సిద్దమవుతున్నా. నా శరీరంలో వస్తున్న ఈ మార్పుల వల్ల నేను ఇబ్బంది పడటం లేదనే అబద్దాన్ని చెప్పలేను.

ఎందుకంటే ఒక నటిగా నాకు ఇది ప్రాబ్లంగానే ఉంటుంది. అయితే దీనిని నేను స్వీకరించక తప్పదు’ అంటూ చెప్పుకొచ్చింది. నెటిజన్ల కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ.. అందరి శరీరం మాదిరిగానే తన శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయని పేర్కొంది. ఇక వయసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందేనని, తాను కూడా ఇందుకు సిద్దమవుతున్నానని చెప్పింది. ఆ తర్వాత ప్రస్తుతం తన శరీరం ఇలా ఉందంటూ ప్రియాంక లేటెస్ట్ ఫొటో షేర్‌ చేసింది. ఇప్పుటి శరీరానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు పాటిస్తున్నానని, 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం నాటి శరీరానికి కాదని నెటిజన్ల కామెంట్స్‌కు ప్రియాంక చురకలు అట్టించింది.