బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్

మీరు విన్నది నిజమే బాలయ్య బాబు సినిమాలో పవర్ స్టార్ ఈ క్రేజీ కాంబినేషన్ పిచ్చేక్కిస్తుంది కదా.ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? అయితే ఇక్కడ ఉన్నది తెలుగు పవర్ స్టార్ కాదు కన్నడ పవర్ స్టార్. అక్కడ ఇండస్ట్రీని వరస హిట్లతో దున్నేస్తున్న పునీత్ రాజ్‌కుమార్ నందమూరి హీరో సినిమాలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మన హీరోలకు ఇగోలు కూడా తక్కువ కావడంతో హాయిగా ఒకరి సినిమాల్లో మరొకరు నటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా బాలయ్య సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈయన. ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. వీటి సీక్వెన్స్ కోసం పిడుగురాళ్లలో ఓ లోకేషన్ చూసి ఫైనల్ చేసారని తెలుస్తుంది.పూర్తిగా పలుగురాళ్ళతో నిండిన ఓ గుట్టకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో బాలయ్యతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సంచలన అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. పునీత్ పాత్ర ఇంటర్వెల్ సమయంలో వస్తుందని తెలుస్తుంది.రాజ్ కుమార్ కుటుంబంతో బాలయ్యకు అద్భుతమైన అనుబంధం ఉంది. గతంలో శాతకర్ణి సినిమాలో పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరిసాడు. అప్పుడు అన్నయ్యతో కలిసి నటించిన బాలయ్య ఇప్పుడు తమ్ముడితో స్క్రీన్ షేర్ చేయబోతున్నాడని తెలుస్తుంది. బోయపాటి సినిమా ఔట్ అండ్ ఔట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తుంది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల కానుంది.