మరోసారి త్రివిక్రమ్‌ సినిమాలో అవకాశం

కొందరు దర్శకులు స్టార్‌ హీరోలతో సినిమా చేసేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. మరికొందరు ఏకంగా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తుంటారు. కానీ హీరో కథ మెచ్చి ప్రాజెక్టు ఓకే అయిన తర్వాతే హీరోయిన్‌ ఎవరన్నదాని గురించి ఆలోచిస్తారు. పైగా కోలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడాలే లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి హీరోయిన్లను రంగంలో దింపుతారు. ముఖ్యంగా ఆల్‌రెడీ చేసిన హీరోయిన్లతో కాకుండా వేరేవాళ్లను తీసుకునేందుకే ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపుతారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా అంతే! తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్‌ కాకుండా చూసుకుంటాడు. కానీ ఓ బేబీ బ్యూటీ సమంతకు మాత్రం మూడు అవకాశాలిచ్చాడు.

తర్వాత గోవా బ్యూటీ ఇలియానా త్రివిక్రమ్‌ తీసిన రెండు సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా రెండింటితోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా పూజాకు మరోసారి త్రివిక్రమ్‌ సినిమాలో మెరిసే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన పూజాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా పూజా ఇప్పటికే త్రివిక్రమ్‌ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌ , అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తోంది.