100 కుటుంబాలకు సరుకులను అందించిన పూజా

బుట్టబొమ్మ పూజా హెగ్డే కోవిడ్‌ సంక్షోభం వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. పూట గడవడం కూడా కష్టంగా ఉన్న నిరుపేదలకు నెలకు సరిపడా సరుకులను అందించింది.

ఈ మేరకు తనే స్వయంగా సరుకులను ప్యాక్‌ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు 100 కుటుంబాలకు ఆమె నిత్యావసర సరుకులను అందించినట్లు తెలుస్తోంది. ఆమె చేస్తున్న మంచి పని పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా పూజా హెగ్డే ఇటీవలే కరోనాను జయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోవిడ్‌ వచ్చిందని కంగారు పడకూడదన్న పూజా ఆక్సీమీటర్‌ను ఎలా వాడాలో తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’, హిందీలో రోహిత్‌ శెట్టికి జోడీగా ‘సర్కస్‌’ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’ సినిమా చేస్తోంది.