స్టాండప్ కమెడియన్‌గా పూజా హెగ్డే

అక్కినేని యువ హీరో అఖిల్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ రావడంతో చిత్రీకరణ బాగా ఆలస్యం అయింది. దీని ప్రభావం విడుదల పైనా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ఆటంకాలనూ దాటుకుని ఈ సినిమాను జూన్‌ రెండో వారంలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ ప్రభావం అది కూడా సాధ్యమయ్యేలా కనిపిండం లేదు. ఇప్పటి వరకు టీజర్‌, సాంగ్‌ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ కూడా లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా పూజ హెగ్డే.. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిటర్‌’లో తన క్యారెక్టర్‌ ఏంటో వెల్లడించింది. ఇందులో తాను స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నాని చెప్పింది.. మైక్ ముందు గంటల తరబడి నిలబడి నవ్వించడం అనేది చిన్న విషయం కాదని, ఈ క్యారెక్టర్ కోసం తాను ఎంతో హోమ్ వర్క్ చేశానని చెప్పుకొచ్చింది పూజ పాప. తన గత చిత్రాలలో దేనికి ఇంతలా హోం వర్క్‌ చేయలేదని చెప్పింది. ఈ సినిమా కోసం తాను పడిన కష్టమంతా మూవీ విడుదలయ్యాక గుర్తిస్తారని పేర్కొంది. మరి ఈ సినిమా కోసం పూజపాప ఏ రేంజ్‌లో కష్టపడిందో సినిమా విడుదలయ్యాక చూడాలి.