యువ హీరో ఆది శశి ట్రైలర్‌ లాంచ్‌ చేసిన పవర్‌ స్టార్‌

యువ హీరో ఆది ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శశి. సాయి కుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ఆదిలోనే మంచి హిట్స్ అందుకున్నాడు ఆది. కానీ, మెల్లగా గ్రాఫ్ పడిపోయింది. దీంతో ‘శశి’ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నాడు. ఈ చిత్రంతోనే శ్రీనివాస నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా బుధవారం మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్, మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. స్నేహం, ప్రేమ ఇతివృత్తంగా సాగే చిత్రంలో ఆది రెండు విభిన్న పాత్రల్లోనూ ఆదిని చూపించారు. ‘మనం ప్రేమించే వాళ్లు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అని ఆది చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతోంది.

శశి ట్రైలర్‌ లాంచ్‌ చేసిన పవర్‌ స్టార్‌

 

చిత్రంలో ఆది సాయి కుమార్ లుక్ కొత్తగా ఉంది. ఇదొక రగ్డ్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’.. ‘ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం’.. ‘ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం’ వంటి డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. సురభి, రాశిసింగ్‌ హీరోయిన్లు నటిస్తుండగా.. రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల, రాధిక, అజయ్‌, వైవా హర్ష సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్పీ వర్మ, సీ రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించారు. మార్చి 19న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.