మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవల క‌రోనా బారిన‌ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోకి ఉండి చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్‌లోకి వెళ్లారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా తన హెల్త్ కండిషన్‌పై అప్‌డేట్ ఇస్తూ రంజాన్ పండగ శుభాకాంక్షలు చెప్పాడు ఎన్టీఆర్‌. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… త్వరలోనే కరోనా రిపోర్ట్ నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ‘ప్రతి ఒక్కరికీ ఈద్ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి’అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ లో నటిస్తుండగా.. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.