ఎన్టీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోమరం భీంగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రతి స్పెషల్‌ డేకు ఈ మూవీ నుంచి దర్శకుడు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన హీరోల ఫస్ట్‌లుక్‌, టీజర్లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మే 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ రానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ కొత్త అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన చేసింది.

‘రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని విడుదల చేయబోతున్నాం. దయచేసి అభిమానులంతా రేపు ఇళ్లలోనే ఉండండి. బయటకు వచ్చి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దు’ అంటూ ట్వీట్‌ చేసింది. కాగా ఎన్టీఆర్‌ సైతం ఈ రోజు అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా కాలంలో తన బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించవద్దని, దయ చేసి అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించాడు. అంతేగాక ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటు అభిమానులను అభ్యర్థించాడు. అయితే ఇటీవల ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. హోం క్వారంటైన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నాడు.