సాయి పల్లవి కి ఎవరు పోటీ లేరు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందంచారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఒక్కో పాట విడుదలవుతూ వస్తున్నాయి. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఆదివారం విడుదలైన ‘సారంగ దరియా’ పాట సూపర్ హిట్ అయ్యింది.

విడుదలైన 24 గంటల్లో ఏకంగా 7 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ ఏడాది బన్ని రికార్డు బ్రేక్‌ చేస్తారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గతేడాది తివ్రిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘రాములో రాములా’ సాంగ్‌ అత్యధిక వ్యూస్‌ సంపాదించి రికార్డు సృష్టించిన సంగతి తెలుస్తోంది.

ఈ ఏడాది సాయి పల్లవి ‘సారంగ దరియా’ ఈ రికార్డు బ్రేక్‌ చేస్తోందని భావిస్తున్నారు నెటిజనలు. సాంగ్‌ ఎంత బాగుందో.. ఇక సాయి పల్లవి డ్యాన్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారంగ దరియా సాంగ్‌కు డ్యాన్స్‌ కంపోజ్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ సాయి పల్లవి మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఓ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆమె డ్యాన్స్‌ చేస్తే.. నెమలి నాట్యం ఆడినట్లు ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘సాయి పల్లవితో ఇది నా మూడో సాంగ్‌. గతంలో ఫిదా చిత్రంలో ‘వచ్చిండే’.. ఎంసీఏ చిత్రంలో ‘ఏవండోయ్‌ నాని గారు’ పాటలకు కొరియోగ్రఫి చేశాను. ఇప్పుడు లవ్‌స్టోరిలో ‘సారంగ దరియా’ పాటకు మరోసారి సాయిపల్లవితో పని చేసే అవకాశం లభించింది. ఇక మొదటి రెండు పాటలు ఎంత హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఈ పాటకు కొరియోగ్రఫి విషయంలో ఒత్తిడి, అంచానాలు అన్ని భారీగానే పెరిగాయి’’ అన్నారు.

‘‘సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమె ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే తనకంటే బాగా ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఆమె క్లాసికల్ డాన్సర్. కొరియాగ్రఫర్స్ కొన్ని మూమెంట్స్ అనుకుంటారు. వాటిని హీరో, హీరోయిన్ కరెక్ట్‌గా చేస్తేనే బాగుంటుంది. సాయి పల్లవితో ఈ మూవ్‌మెంట్ రాదు అని ఎప్పుడూ అనుకోలేదు. మేము చెప్పిన మూవ్‌మెంట్స్‌ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్‌లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం’’ అన్నారు.

‘‘తను డ్యాన్స్‌ చూస్తే.. నెమలి నాట్యం ఆడినట్లే ఉంటుంది. స్టార్‌ హీరోలకు కూడా కష్టంగా భావించే స్టెప్స్‌ని తను చాలా చేస్తుంది. డ్యాన్స్‌ విషయంలో తనతో ఏ హీరోయిన్‌ పోటి పడలేరు అని తెలిపారు. ఈ చిత్రంలో తాను సారంగ దరియాతో పాటు మరో రెయిన్‌ పాటకు కొరియోగ్రఫి చేసినట్లు వెల్లడించారు శేఖర్‌ మాస్టర్‌.