షూటింగ్ లో‌ నిఖిల్‌ కాలికి గాయం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం కార్తికేయ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ గుజరాత్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొంటున్న నిఖిల్‌ కాలికి గాయాలైనట్లు సమాచారం. డూప్‌ లేకుండా యాక్షన్‌ స్టంట్స్‌ చేసే క్రమంలో అతడు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్‌కి బ్రేక్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చిత్రబృందం తెలిపింది. రానున్న మూడు రోజులూ నిఖిల్‌కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ లేదు. ఈ మూడు రోజులూ విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత నిఖిల్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడు.

ఇదిలా వుంటే.. అప్పట్లో సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌గా టాక్‌ తెచ్చుకున్న ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా వస్తోంది ‘కార్తికేయ 2’. ఈ చిత్రం ద్వారా హీరో నిఖిల్‌, దర్శకుడు చందూ మొండేటి మరోసారి కలిసి పని చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో ’18 పేజీస్‌’ అనే మరో చిత్రం చేస్తున్నాడు. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.