లైగర్.. వినడానికి కూడా కొత్తగా ఉంది కదా. అవును పూరీ జగన్నాథ్ ఎప్పుడూ తన సినిమాలకు చిత్రమైన టైటిల్స్ పెడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లైగర్ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టాడు. ఈ టైటిల్ వినగానే ఏంటిది ఇలా ఉంది..అసలు ఇలాంటి పదం ఒకటుందా అనే అనుమానాలు చాలా మందిలో వచ్చాయి. జనవరి 18న (నేడు) ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసాడు. అందులో విజయ్ దేవరకొండ కూడా చిరుత కళ్ళతో సింహంలా రెచ్చిపోతున్నాడు. చేతికి గ్లౌజ్ వేసుకుని సింహంలా చూస్తున్నాడు ఈయన. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న లైగర్ సినిమాను హిందీలో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలాగే నిర్మాణంలో భాగస్వామి కూడా. అయితే ఈ టైటిల్ గురించి గూగుల్ లో శోధిస్తున్నారు అభిమానులు. ఫైటర్ విన్నాం..టైగర్ విన్నాం కానీ లైగర్ ఏంటి చిత్రంగా అంటూ అడుగుతున్నారు. దీనికి అర్థం ఉంది. సాధారణంగా క్రాస్ బ్రీడ్ ను లైగర్ అంటారు. అందుకే ట్యాగ్ లైన్ కూడా ఇదే పెట్టాడు పూరీ జగన్నాథ్. లైగర్ సినిమాతోనే బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. వరస ఫ్లాపులతో ఉన్న విజయ్ కు ఈ చిత్ర విజయం కీలకంగా మారింది. ఉత్తరాది భామ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.ఇదిలా ఉంటే లైగర్ అనే పదానికి డిక్షనరిలో ఉన్న అర్థమేంటో తెలుసా..? మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు. ఇప్పుడు విజయ్ సినిమాకు ఇదే పేరును ఖరారు చేసారు. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
