రెమ్యునరేషన్‌ను పెంచేసిన జాతిరత్నం

‘ఏం సక్కగున్నావ్‌రో‌.. నా సొట్ట సెంపలోడా.. ఏం సిక్కగున్నవ్‌రో.. నా సిట్టి జుంపాలోడ..’ అంటూ ఈ పాటను మరోసారి పాడుకుంటున్నారు అమ్మాయిలు. ఇంతకీ పడుచుల మనసు దోచిన ఆ సుందరాగుండు ఎవరనుకుంటున్నారు? యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి. అతడు ప్రధాన పాత్రలో నటించిన జాతి రత్నాలు సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిలేరియస్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. చాలా థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాం అంటూ ప్రేక్షకులు పాజిటివ్‌ రివ్యూ ఇస్తుండటంతో చిత్రయూనిట్‌ ఫుల్‌ ఖుషీలో ఉంది. మొత్తానికి ఈ సినిమా నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో నవీన్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచేశాడట. ఎలాగో పలువురు దర్శక, నిర్మాతలు నవీన్‌తో సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తను అడిగినంత ఇవ్వాలని కండీషన్‌ పెడుతూ క్రేజ్‌ను క్యాష్‌ను చేసుకుంటున్నాడట. ఇప్పటికే ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేశ్‌తో సినిమా చేసేందుకు నవీన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు నవీన్‌ రూ.2 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చుకునేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టితో జోడీ కట్టనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.