పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్న నాని

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఒకరోజు ముందే నాని ‘టక్‌ జగదీష్‌’‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. సింగిల్‌ డైలాగ్‌ లేకుండా పాటతోనే కథ మొత్తం అర్థమయ్యేలా టీజర్‌ కొనసాగింది. ఇందులో ఎక్కువగా టక్‌ వేసుకునే కనిపిస్తున్న హీరో ఏ విషయాన్నైనా స్మార్ట్‌గా డీల్‌ చేసేట్లు కనిపిస్తున్నాడు.

‘అంగి సుట్టు మడతేసి మంచిసెడు వడపోసి..’ అని పాటలో చెప్పినట్లుగానే తన చొక్కా మడతెడుతూ పనులు చక్కబెడుతున్నాడీ హీరో. కోళ్ల పందెంలో గాయపడ్డ కోడి కాలికి కట్టు కడుతున్నాడు. చివర్లో కాళ్లకు గోరింటాకు పెట్టుకుని ఫైటింగ్‌కు రెడీ అవుతున్నాడు. అంటే ఓ వైపు పెళ్లి కొడుకుగా ముస్తాబవుతూనే రౌడీల భరతం పడుతున్నాడన్నమాట.

అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్‌ అవ్వలేదు అన్నమాట రాకూడదు అంటూ లాక్‌డౌన్‌లో ‘వి’ సినిమాతో నిరాశపర్చాడు నాని. దీంతో ఈసారి కమర్షియల్‌ హంగులద్దిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టక్‌ జగదీష్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పైగా ఈసారి తన అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ తప్పనిసరని చెప్తున్నాడు.

మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో, నానిని సక్సెస్‌ బాట పట్టిస్తుందో? లేదో? చూడాలి. షైన్‌ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇదిలా వుంటే నాని మరోవైపు శ్యామ్‌ సింగరాయ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతీశెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు.