ఆర్ఆర్ఆర్ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్

ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఓ గాసిప్ జోరుగా చక్కర్లు కొడుతోంది. అదే ఆర్ఆర్ఆర్ స్పెషల్ ప్రోమో. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఓ స్పెషల్ ప్రోమో రెడీ చేస్తోంది. ఇది నిజమే. కానీ ఈ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తారనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే విషయంపై యూనిట్ సభ్యులెవ్వరూ నోరు మెదపడం లేదు. ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేసే రాజమౌళి.. దీనికి కూడా స్పెషల్ ప్రమోషన్ ఒకటి ప్లాన్ చేశాడని టాక్.ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే 2 టీజర్లు వచ్చాయి. ముందుగా రామ్ చరణ్ టీజర్ వచ్చింది. దానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీజర్ వచ్చింది. దానికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్లిద్దర్నీ చూపిస్తూ రిపబ్లిక్ డే కు ఓ స్పెషల్ టీజర్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఈ టీజర్ కే చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తాడనే ప్రచారం సాగుతోంది.రాజమౌళి సినిమాలకు చిరంజీవిని లింక్ పెడుతూ గాసిప్స్ అల్లేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో రాజమౌళి తీసిన బాహుబలి-2 సినిమా టైమ్ లో కూడా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. బాహుబలి-2 చిరంజీవి వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. రాజమౌళి వాటిని వెంటనే ఖండించాడు కూడా. అయితే ఆర్ఆర్ఆర్ స్పెషల్ టీజర్ విషయంలో మాత్రం ఇంతవరకు అలాంటి ఖండనలు రాలేదు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి, ఈసారి ఈ పుకారు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు చాలామంది.