మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య టీజర్ విడుదలైంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా సైరా సినిమా తెలుగులో మాత్రమే ఆడటంతో ఆచార్యతో బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చిరు. సామాజిక అంశాలను కమర్షియల్ హంగులద్ది తెరకెక్కించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఇప్పుడు చిరు సినిమాకు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఆచార్యను కూడా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్, చిరంజీవి లాంటి కాంబినేషన్‌ను కలిపాడు. ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా ఆచార్య అని ఎందుకు అంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..? అంటూ చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజర్ అంతా యాక్షన్ ప్యాక్డ్‌గా నింపేసాడు కొరటాల శివ. బలహీనులకు తోడుగా నిలబడానికి దేవుడే రావాల్సిన అవసరం లేదు.. దేవుడు లాంటి వాడు వస్తే సరిపోతుంది. అదే కాన్సెప్టుతోనే ఆచార్య వస్తుంది.మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరో ప్రధానమైన హైలైట్. కేవలం చిరంజీవిని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు కొరటాల. 2021 సమ్మర్‌లోనే ఆచార్య విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
