తనయుడికి స్పెష‌ల్ విషెస్ తెలియ‌జేసిన చిరంజీవి

పిల్ల‌లు పుట్టిన‌ప్పుడు కాదు వారు ప్ర‌యోజ‌కులు అయిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు సంతోషిస్తారు అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే ఫీలింగ్‌లో ఉన్నారు. త‌న క‌ళ్ల ముందు పెరిగిన రామ్ చ‌ర‌ణ్ ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టు న‌టుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్టేట‌స్ పొందారు. దీంతో చ‌ర‌ణ్ అభిమాన గ‌ణం కూడా అశేషంగా పెరిగింది. ఈ రోజు చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని ఆయ‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌త్యేక వీడియో షేర్ చేస్తూ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు . ఇందులో చరణ్‌ చిన్నప్పుడు గొడుగు పట్టుకుని ఉన్న ఫొటోని ఇప్పుడు, చ‌రణ్‌ పెద్దవాడయిన తర్వాత చిరుకు గొడుకు పడుతున్న ఫొటోని అప్పుడు, ‘ఆచార్య’ సెట్స్‌లో చిరుకు గొడుగు పడుతున్న ఫొటోని చూపిస్తూ ఎల్ల‌ప్పుడు అని అంటూ త‌న ప్రేమ‌ను చాటుకున్నారు చిరంజీవి. ‘హి ఈజ్‌ కేరింగ్‌ సన్‌..’ అని తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్‌.. గాడ్‌ బ్లెస్‌.. అమ్మ అండ్‌ డాడీ’ అని చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు దంపతులు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమాకు సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగించాయి. ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ .ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ చేతులో గ‌న్‌లు ప‌ట్టుకొని ముందుకు సాగుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది.ఈ సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఇందులో దేవాలయం సెట్ కోసం దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ ఏర్పాటు చేయ‌గా, వీటికి సంబంధించిన ఫొటోల‌ను చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో ఏర్పాటు చేశారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ జోడి క‌ట్టింది.