హైదరాబాద్,తీస్మార్ న్యూస్:మెగా కుటుంబాన్ని కరోనా కలవర పెడుతుంది. ముందు మెగాస్టార్ చిరంజీవికి కరోనా వచ్చిందని అప్పట్లో ఒక వార్త హల్ చల్ చేసింది అయితే అది అబద్ధమని తర్వాత తేలింది. అప్పట్లో తప్పుడు ఫలితాలతో చిరుకు కరోనా పాజిటివ్ అని బయటపడింది. కానీ రెండు రోజుల తర్వాత నెగిటివ్ అని తేలిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం వరసగా మెగా హీరోలు కరోనా బారిన పడుతున్నారు. రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని గంటల్లోనే అదే కుటుంబంలో వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో మిగిలిన హీరోల పరిస్థితి ఏంటి అంటూ ఇప్పుడు కంగారు మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్ గా మెగా హీరోలు కలుస్తూనే ఉన్నారు. దాంతో ఒక్కరికి కరోనా వచ్చినా కూడా అందరూ బాధితులు కాక తప్పదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందేమో అని భయపడుతున్నారు దర్శక నిర్మాతలు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు కనీసం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారంతా. రామ్ చరణ్ కు పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో విషయం అభిమానులకు చెప్పాడు. అంతేకాదు తనను గత రెండు మూడు రోజులుగా కలిసిన వాళ్లంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కూడా తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. కానీ లక్షణాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని.. క్వారంటైన్ లో ఉన్నానని చెప్పాడు వరుణ్ తేజ్. చరణ్ కు కూడా ఎలాంటి లక్షణాలు లేవు. అయినా కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉన్నారు ఈ ఇద్దరు మెగా హీరోలు. దాంతో ఇప్పుడు మిగిలిన మెగా కుటుంబం కూడా కరోనా టెస్టులకు సిద్ధమవుతున్నారు.