ఈ విషయంలో నా మనసు మారదు

‘‘ఈ విషయంలో నా మనసు మారదు. కుదరదంటే కుదరదు’’ అంటున్నారట లావణ్యా త్రిపాఠి. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ ఇంత పట్టుదలగా ఉన్నారంటే… కొన్ని ఉత్పత్తులను ప్రచారం చేసే విషయంలో. వాణిజ్య ప్రకటనలంటే మంచి ‘చెక్‌’ అందుతుంది. మరి.. భారీ పారితోషికం అందించే ఆ చెక్‌ని లావణ్య ఎందుకు కాదనుకుంటున్నారంటే అవి ‘లిక్కర్‌ బ్రాండ్స్‌’కి సంబంధించిన ప్రకటనలు కాబట్టి.

ఆరోగ్యానికి హాని కలిగించేవాటిని ప్రమోట్‌ చేయడం కుదరదని చెప్పేశారట. ఇటీవల కొన్ని ప్రముఖ లిక్కర్‌ బ్రాండ్‌లు లావణ్యని సంప్రదిస్తే ‘నో’ చెప్పేశారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. సందీప్‌ కిషన్‌ సరసన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చేస్తున్నారు. ఇందులో లావణ్య హాకీ ప్లేయర్‌. ఈ సినిమా కోసం హాకీ నేర్చుకున్నారు. అలాగే కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో అథర్వకు జోడీగా ఓ సినిమా చేస్తున్నారు.