లావణ్య ఈ కథకు పూర్తి న్యాయం చేశారు

‘‘చావు కబురు చల్లగా’ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను ఎంచుకున్నందుకు ‘బన్నీ’ వాసుగారికి ధన్యవాదాలు. అల్లు అరవింద్‌గారు బాగా సపోర్ట్‌ చేశారు. డైరెక్టర్‌ క్లారిటీతో ఈ సినిమా తీశాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది’’ అని కార్తికేయ అన్నారు.

‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘కదిలే కళ్లనడిగా..’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటను మంగళవారం విడుదల చేశారు. కౌశిక్‌ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘ఇదొక లవ్‌ స్టోరీ. సీరియస్‌ పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం. ఈ సినిమాలో హీరో డెడ్‌ బాడీస్‌ను పికప్‌ చేసుకొనే వెహికల్‌ డ్రైవర్‌గా, హీరోయిన్‌ నర్స్‌గా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఫ్రెష్‌ కంటెంట్‌తో కౌశిక్‌ చెప్పిన ఈ పాయింట్‌ మిస్‌ అవ్వకూడదని ఈ సినిమా చేశా.

ఎడిటింగ్‌ రూమ్‌లో సినిమా చూసినప్పుడు హ్యాపీ. కార్తికేయ, లావణ్య ఈ కథకు పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. సినిమాలో భావోద్వేగాలు బాగుంటాయి, అందరూ కనెక్ట్‌ అవుతారు. గీతా ఆర్ట్స్‌లో రెండో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.. థ్యాంక్స్‌ టు వాసుగారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి.