మోహన్ బాబుకు రూ.లక్ష జరిమానా

డైలాక్ కింగ్ మంచు మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు ఏకంగా రూ.లక్ష జరిమానా విధించారు. దీనికి సంబంధించిన నోటీసును కూడా జీహెచ్ఎంసీ అధికారులు పంపారు. ఆ నోటీసులో ఉల్లంఘనకు సంబంధించిన ఫోటోను కూడా జత పరిచారు. పూర్తి వివరాలివీ..

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జివద్ద ఉన్న బస్టాపు ఎదురుగా మోహన్ బాబు ఇల్లు ఉంది. ఆయన ఇంటి ప్రహరీకి ఎత్తైన అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డును కొన్నాళ్ల క్రితం అమర్చారు. నేల నుంచి ఏకంగా 15 అడుగుల ఎత్తులో ఆ బిల్ బోర్డు ఉండడంతో అది జీహెచ్ఎంసీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కొందరు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు చర్యలు తీసుకున్నారు. అందుకుగాను, మోహన్ బాబుకు రూ.లక్ష జరిమానా విధించారు.

అంతేకాకుండా జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ఇలా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు జరిమానా విధిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. అయితే, దీనిపై మోహన్ బాబు కానీ, ఆయన కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది.