అఖిల్‌ సరసన కృతీ శెట్టి

వైష్ణవ్‌ తేజ్‌, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం “ఉప్పెన”. ఈ సినిమా రిలీజవకముందే కృతీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్ చూసిన‌ కుర్రకారంతా కృతీ నవ్వుల మాయలో పడి తూగుతున్నారు. ఎక్కడ చూసినా ఆమె పేరే జపిస్తున్నారు. అటు సినీ ఉద్ధండులు కూడా ఆమె అందాన్ని, ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పలువురు సెలబ్రిటీలు ఆమె చాలా బాగా నటించిందని ప్రశంసించారు. మెగాస్టార్‌ చిరంజీవి అయితే ఏకంగా ‘దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్‌లను బుక్‌ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో దొరక్కపోవచ్చు’ అని వేదిక మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరి మాటలను అక్షరాలా నిజం చేస్తూ కృతీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

ఇప్పటికే నాని, సుధీర్‌బాబు సినిమాల్లో నటించే ఛాన్స్‌ రాగా నాగశౌర్య చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరోతో జోడీ కట్టే బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ క్యూటీ అక్కినేని అఖిల్‌ సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కించబోయే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం బాడీ పెంచుతూ తెగ కష్టపడుతున్నాడు అఖిల్‌. కథ డిమాండ్‌ మేరకు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. ఇప్పటికే గుర్రపు స్వారీ వచ్చినప్పటికీ ఇంకా సాన పెట్టేందుకే ఈ తపన, కృషి. ఏదేమైనా యంగ్‌ హీరో అఖిల్‌ పక్కన, కొత్త హీరోయిన్‌ కృతీని ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు.