రెమ్యునరేషన్‌ను పెంచిన బేబమ్మ

తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతలా మారిపోయింది కృతిశెట్టి. అమాయకపు కళ్లు, సొట్టబుగ్గలతో ఆకట్టుకునే మనోహర రూపం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసి ఉప్పెనంత విజయాన్ని సొంతం చేసుకుంది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఈ ముంబై చిన్నది… వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఇప్పటికే నేచురల్‌ స్టార్‌ నానితో శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక, రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్‌ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట.

ఇదిలా ఉంటే.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఉప్పెన వసూళ్ల సునామీ కొనసాగుతోంది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా హీరో వైష్ణవ్‌ తేజ్‌, బేబమ్మకు భారీ మొత్తాన్ని బహుమతిగా ఇస్తున్నట్లు సమాచారం. ఆశీకి రూ. కోటి, బేబమ్మకు 25 లక్షలు ఇచ్చినట్లు టీ-టౌన్‌ టాక్‌. ఈ నేపథ్యంలో తనకున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడిందట కృతిశెట్టి. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలన్న చందంగా రెమ్యునరేషన్‌ను ఏకంగా కోటి రూపాయలకు పెంచిందంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఏదేమైనా మొదటి సినిమాకు పది లక్షల లోపు తీసుకున్న బేబమ్మ.. స్టార్‌ హీరోయిన్ల మాదిరి ఇప్పటి నుంచే భారీ మొత్తం డిమాండ్‌ చేయడం సాహసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.