రంగ‌మార్తాండ సినిమాకు బ్రేక్

కృష్ణ‌వంశీ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా `రంగ‌మార్తాండ‌`. ఓ మ‌రాఠీ సినిమాకి ఇది రీమేక్‌. ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే ఈ సినిమా ఆగిపోయింద‌ని టాక్. మ‌రో 20 రోజుల షూటింగ్ ఉంద‌న‌గా… `నేను ఈ సినిమాకి మ‌రో పైసా కూడా పెట్టుబ‌డి పెట్ట‌లేను` అని నిర్మాత చేతులెత్తేసిన‌ట్టు తెలుస్తోంది. సినిమా చివ‌రి ద‌శ‌లో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎవ‌రైనా షాకే. అందుకే కృష్ణ‌వంశీ ఇప్పుడు మ‌రో నిర్మాత కోసం అన్వేషిస్తున్నాడ‌ని తెలుస్తోంది. కృష్ణ‌వంశీది ఎప్పుడూ జ‌క్క‌న్న స్టైల్‌. త‌న‌కు న‌చ్చే అవుట్ పుట్ వ‌చ్చేంత వ‌ర‌కూ… సినిమాని తీస్తూనే ఉంటాడు. ఇప్ప‌టికే సినిమాకి అనుకున్న బ‌డ్జెట్ దాటిపోయింద‌ని, ఇప్పుడు ఫైనాన్స్ కూడా తెచ్చుకోలేని ప‌రిస్థితుల్లో… నిర్మాత సైడ్ అయిపోయాడ‌ని స‌మాచారం. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్ష‌న్‌, ప‌బ్లిసిటీ, పేమెంట్లు.. ఇలా చాలా ఖ‌ర్చు వుంది. అవ‌న్నీ భ‌రించ‌డానికి మ‌రో నిర్మాత అవ‌స‌రం వ‌చ్చింది. మ‌రో నిర్మాత దొరికేంత వ‌ర‌కూ ఈ సినిమా పెండింగ్ లో ఉన్న‌ట్టే. `న‌క్ష‌త్రం` లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత‌.. చాలా గ్యాప్ తీసుకున్నాడు కృష్ణ‌వంశీ. ఈ సినిమాతో ఎలాగైనా త‌న మార్క్ చూపించాల‌ని భావిస్తున్నాడు. అలాంటి సినిమాకి అనుకోని ఆటంకం ఏర్ప‌డింది. అయినా కృష్ణ‌వంశీకి ఇవ‌న్నీ మామూలే. ఇలా అవాంత‌రాల్ని దాటుకొచ్చిన ప్ర‌తీసారీ వంశీ హిట్టు కొట్టాడు. ఈసారి ఏం అవుతుందో?