ఆనందంలో మునిగి తేలుతున్న కోహ్లి దంపతులు

ఇటీవల తమకు మహాలక్ష్మీ వంటి పాప పుట్టడంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తొలి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. స్టార్‌ కపూల్‌ కాడవంతో పాపకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విరుష్క జంట ఎక్కడికి పోయినా వారి వెంట ఓ కన్నేసి పెడుతున్నారు.

ఈ క్రమంలో తమ కూతురు ప్రైవసికి భంగం కలిగించొద్దని, పాప ఫోటోలు తీయవద్దని అనుష్క, విరాట్‌ ఫోటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో తమ పాప ఫొటోలను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కాగా జనవరి 11న తమకు పాప పుట్టిందని కోహ్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇక కోహ్లి కూతురుపై బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ ట్వీట్‌ చేయడంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మ‌న క్రికెట్ టీమ్ అంతా క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తోందంటూ బిగ్ బీ ఫన్నీ ట్వీట్ చేశాడు.

ఇందులో క్రికెట‌ర్లంద‌రికీ కూతుళ్లే పుట్టారంటూ వ‌రుస‌గా ఒక్కొక్క‌రి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఉంటుందేమో అని కామెంట్ చేశాడు. ఆ లిస్ట్‌లో వ‌రుస‌గా రైనా, గంభీర్‌, రోహిత్‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేష్ యాద‌వ్‌ల పేర్లు ప్రస్తావించాడు.

తాజాగా కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భ‌విష్య‌త్తు మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఒక్క హర్ధిక్‌ పాండ్యాకు తప్ప మిగతా టీమిండియా క్రికెటర్లందరికి ఈ మధ్య కాలంలో దాదాపు ఆడపిల్లలే జన్మించారు. హర్ధిక్‌ పాండ్యా, నటాషాకు గతేడాది జూలై 30న కొడుకు పుట్టాడు. అంతేగాని రైనా నుంచి ఉమేష్‌ యాదవ్‌ వరకు అందరి ఇంట్లోకి మహాలక్ష్మీలే అడుగుపెట్టారు.