అధీర ఎలా బ్రతికున్నాడు?

కన్నడ స్టార్ యశ్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గోల్డ్ మాఫీయా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వేసవిలో విడుదల కానున్న ఈ సీక్వెల్ షూటింగ్ చివరి దశలో ఉంది.ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను జనవరి 8న హీరో యశ్ బర్త్డే సందర్భంగా ఉదయం 10:18 గంటలకు విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అప్పటి ‘కేజీఎఫ్ టైమ్స్’ పత్రిక పేరుతో ఓ పేపరును విడుదల చేసింది. ఆ పేపరులో చాలా విషయాలు డిస్కస్ చేసిన దర్శకుడు.. ‘అధీర ఎలా బతికున్నాడు?’ అనే పేరుతో ఓ ఆర్టికల్ ప్రముఖంగా ప్రచురించారు. దీనిలో అధీర ఫొటోతోపాటు..దాడి చేసిన రోజు నాటి ఫోటో.. రాఖీ సింహాసనాన్ని అధిష్టించిన ఫొటోను ప్రింట్ చేశారు.అయితే.. రాఖీ ఫొటోకి రాసిన క్యాప్షన్ ఈ విధంగా ఉంది.  ‘చరిత్రకు రాజులు బానిసలు. కానీ రాకీ చరిత్ర సృష్టించినోడు..’ అని క్యాప్షన్ పెట్టారు. ‘అధీర ఎలా బతికున్నాడు?’ను టైటిల్గా ఇచ్చి దాని కింద.. ‘వాడు ఓడిపోడా? వాడికి చావు లేదా? వాడి మీద దాడి ముందే తెలుసుకోగలిగాడా? దేశానికి తెలియాలి’ అనే సబ్ టైటిల్స్ను ఇచ్చారు. ‘కేజీఎఫ్ అధిపతి సూర్యవర్థన్ ఆరోగ్యం క్షీణించినప్పుడు తన అధికారాన్ని పెద్ద కొడుకు గరుడకి అప్పజెప్పాడు. ఈ నిర్ణయం అధీర జీర్ణించుకోలేక పోయాడు. అధీర గరుడని చంపుదామనుకుని పన్నిన పన్నాగం విఫలమైంది. గరుడకి ఈ విషయం తెలిసాక అధీరాని అంతం చేయాలనుకున్నాడు. విజయవంతంగా చేసాడు. కానీ.. అన్నీ అనుకున్నట్టే జరిగితే అధీర ఎలా తిరిగొచ్చాడు? చావుని ఎలా జయించాడు?’ అంటూ ముగించారు. పూర్తి కథ చాప్టర్-2లో కొనసాగించబడుతుందని చెప్పారు.‘తొందర పడితే చరిత్రని సృష్టించలేము.. అలా అని చరిత్రని ప్లాన్ చేసి.. బ్లూ ప్రింట్ తీయలేము’ అనే అద్భుతమైన కొటేషన్ తో ఆర్టికల్ను ప్రచురించారు మేకర్స్. ‘కేజీఎఫ్ టైమ్స్’ పేరుతో రిలీజ్ చేసిన పాత న్యూస్ పేపర్ క్లిప్ ఫొటో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.అధీర ఎలా బతికున్నాడనేది అనే విషయాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. తొలి పార్ట్ లో అధీర చనిపోయాడని చెబుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ చూపిస్తారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టు చూపిస్తారా? లేక.. మరో కోణంలో చూపిస్తారా? అనే ఆలోచనలు చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఈ సినిమా ఓ రేంజ్లో హైప్ను క్రియేట్ చేసింది. దీంతో.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ‘అధీర’గా సంజయ్ దత్ నటిస్తున్నారు.