రాకీ భాయ్‌ను ఢీ కొట్టడానికి అధీరా రెడీ

రాకీ భాయ్‌ను ఢీ కొట్టడానికి అధీరా రెడీ అయ్యారు. డిసెంబర్‌లో ఈ ఇద్దరూ తలపడనున్నారని తెలిసింది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌.. ఛాప్టర్‌: 2’. మొదటి భాగం 2018లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగంలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు.

అధీరా పాత్రలో సంజయ్‌ కనిపిస్తారు. రాకీ భాయ్‌గా యశ్‌ నటిస్తున్నారు. డిసెంబర్‌ 6 నుంచి సంజయ్‌ దత్‌ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట. డిసెంబర్‌ చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని టాక్‌. ఈ సినిమాలో రవీనా టాండన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.