నువ్వే ఒక చరిత్ర

ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పుట్టినప్పటి  నుంచి నేటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి తాలూకు ఫలితాలు, విజయాల్ని త్రీడీ విజువల్‌ ఎఫెక్ట్స్‌లతో పునఃసృష్టిస్తూ దర్శకుడు బందూక్‌ లక్ష్మణ్‌ ‘కేసీఆర్‌-నువ్వే ఒక చరిత్ర’ పేరుతో  ఓ డాక్యుమెంటరీ సినిమాను రూపొందించారు. కేసీఆర్‌గారి 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఈ డాక్యుమెంటరీని విడుదలచేయబోతున్నారు.  ఈ సందర్భంగా బందూక్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘1964-68 మధ్యకాలంలో కేసీఆర్‌గారు చదువుకున్న దుబ్బాక ప్రభుత్వ పాఠశాలను త్రీడీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా ఆవిష్కృతం చేశాం.  స్కూల్‌లో చదువుతున్నప్పుడు కేసీఆర్‌గారు ‘భీష్మ ద్రోణ కృపాధి ధన్వి నికారచలంబు..’ అనే కఠినమైన మహాభారతంలోని పద్యాలు పాడి బహుమతులు గెలుచుకున్నారు.  ఆ అపురూప ఘట్టాల్ని మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలో చిత్రీకరించాం. దుబ్బాక, చింతమడక గ్రామాలు అరవై ఏళ్ల క్రితం  ఎలా ఉండేవో  ఊహించుకుంటూ త్రీడీ ఆర్ట్స్‌లో చిత్రాలు గీసి గ్రాఫిక్స్‌ వర్క్‌ను పూర్తిచేశాం. రాష్ట్ర అభివృద్ధికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి మనోగతాన్ని ఈ డాక్యుమెంటరీ సినిమాలో స్ఫూర్తిదాయకంగా చూపించబోతున్నాం. ఇందులో రెండు బిట్‌ సాంగ్స్‌ ఉంటాయి’ అని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ సినిమాకు ఆన్‌లైన్‌ ప్రొడ్యూసర్‌: రమేష్‌ మాదాసు, రచనా సహకారం: సుధీర్‌ గంగాడి, పాటలు: కృష్ణవేణి, క్రియేటివ్‌ హెడ్‌, ఎడిటింగ్‌: మురళి రుద్ర, సీజీ, త్రీడీ గ్రాఫిక్స్‌: రాజ్‌, శశి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ మురారి.