ఎన్నికల ఫలితాలపై కంగనా ట్వీట్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది. కాగా కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కంగనా కాంగ్రెస్‌ పార్టీపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘ప్రియమైన కాంగ్రెస్‌.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అంటూ కంగనా కాంగ్రెస్‌ పార్టీకి చురకలంటించారు.

కాగా ఉత్కంఠ రేకెత్తిస్తోన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించగా.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌-53 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎంఐఎం 38 డివిజన్లలో విజయం సాధించింది.