కరోనా నుంచి కోలుకున్న కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం నిర్వహించిన పరీక్షలో కంగనాకు నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. కరోనాను ఎలా ఎదుర్కొన్నానో చెప్పాలని తనకు ఉన్నప్పటికీ కోవిడ్‌ ఫ్యాన్‌ క్లబ్స్‌ను నిరాశపరచాలనుకోవడం లేదని తెలిపింది. కరోనా వైరస్‌ గురించి గౌరవం లేకుండా మాట్లాడితే తప్పు పట్టేవాళ్లు ఉన్నారని, అందుకే తాను ఈ విషయంపై పెద్దగా మాట్లాడాలనుకోవడం లేదని పేర్కొంది. ఇక తాను బావుండాలని కోరుకున్న వారందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

కాగా ఈనెల 8న తనకు కరోనా సోకినట్లు కంగనా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది చిన్న ఫ్లూ మాత్రమేనని,దీన్ని అంతం చేస్తానని కంగనా పేర్కొన్న సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయిన సంగతి తెలిసిందే. వైరస్‌ గురించి ఎక్కువగా బయపడితే అది మనల్ని బయపెడుతుందని, అందుకే తాను ఈ వైరస్‌కు భయపడనని పేర్కొంది. ఇక ప్రస్తతం ఆమె ‘టికు వెడ్స్ షేరు’ అనే లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్ పై ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.