మోసం చేసిన కంగనా రనౌత్‌ బాడీగార్డు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్‌ను మోసం చేసిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరానికి చెందిన 30ఏళ్ల మహిళ బ్యూటీషియన్‌గా పనిచేస్తూ అథేరీ ప్రాంతంలో నివాసముంటోంది. ఈమెకు ఎనిమిదేళ్ల నుంచి బీటైన్‌కు చెందిన నటి వ్యక్తిగత బాడీగార్డ్‌ కుమార్‌ హె‍గ్డేకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకుంటానని బ్యూటీషియన్‌తో చెప్పి అప్పటి నుంచి ఆమె ఫ్లాట్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మహిళతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరువాత పెళ్లి చేసుకుందామని బ్యూటీషియన్‌ అతన్ని ఎన్నిసార్లు అడిగిన ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కుటుంబ అవసరాల కోసం బ్యూటీషియన్ నుంచి రూ.50వేల నగదు తీసుకొని, అతని స్వస్థలమైన కర్ణాటకకు వెళ్లాడు. స్వస్థలానికి వెళ్లిన తరువాత కుమార్‌ మహిళతో మాట్లాడటం మానేసి ఆమెను దూరం పెట్డడం ప్రారంభించాడు. అనంతరం కుమార్‌ తల్లి బ్యూటీషియన్‌కు ఫోన్ చేసి తమ కులాలు వేరని, తనతో పెళ్లి జరగదని చెప్పింది. అంతేగాక తన కొడుక్కి వేరే సంబంధం చూసినట్లు పేర్కొంది.

దీంతో తనను మోసం చేసి, జూన్ 5వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు కుమార్‌ హెగ్డే సిద్దపడ్డాడని గ్రహించిన మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసింది. బ్యూటీషియన్ ఫిర్యాదు మేరకు బాడీగార్డుపై ఐపీసీ సెక్షన్ 376, 377, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. కాగా కుమార్‌ హెగ్డే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ వ్యక్తిగత బాడీగార్డ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.