మీతోపాటు నేనున్నా

మదర్స్‌ డేను పురస్కరించుకుని అందరూ ఎవరికి తోచినట్లు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, అమ్మతో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తెగ సందడి చేశారు. నటుడు జగపతిబాబు కూడా మదర్స్‌డే విషెస్‌ చెప్తూనే హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేశాడు.

“మదర్స్‌డే సందర్భంగా భూ దేవికి వందనాలు తెలుపుతున్నాను. ప్రకృతితో పాటు సహజీవనం చేద్దామని, అందులో భాగంగా ప్రతిరోజు ధ్యానం చేద్దామని ఇక్కడికి వచ్చాను. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ధ్యానం చేస్తాను. ఇది చాలా అవసరం. ప్రకృతికి విలువ ఇవ్వకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలీదు.

గుర్తుపెట్టుకోండి. కరోనా అనేది వార్నింగ్‌ మాత్రమే.. మనం ఇలాగే ఉంటే, మన బుద్ధులు మారకపోతే.. మనకు బుద్ధి చెప్పేందుకు ప్రకృతి రెడీగా ఉంది. ఈసారి చాలా గట్టిగా చెప్తుంది. ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారో మీరే ఆలోచించుకోండి. అందుకని ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం. మీతోపాటు నేనున్నా, నాతో పాటు మీరుండండి” అని జగ్గూభాయ్‌ కోరాడు