చిట్టికి వరుస సినిమా అవకాశాలు

మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది ‘జాతి రత్నాలు’ మూవీ హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా(చిట్టి). ఫుల్‌లెన్త్‌ కామెడీతో సాగిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రంలో హీరో నవిన్‌ పోలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, హీరోయిన్‌ ఫరియాల నటనపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించుకుంది.

ట్రైలర్‌ విడుదల సమయంలో డార్లింగ్‌ ప్రభాస్‌ ఆమెను చూసి ఏంటి హీరోయిన్‌ ఇంత హైట్‌ ఉందంటు కామెంట్‌ చేయడంలో ఒక్కసారిగా అందరి చూపు ఆమెపై పడింది. ఇక మూవీ విడుదల అయ్యాక ఆమెకు మరింత క్రేజ్‌ పెరిగిపోయింది. డెబ్యూ మూవీతోనే తన అందం, అభినయంతో పాటు యాక్టింగ్‌ స్కిల్స్‌తో అందరిని కట్టిపడేసింది ఫరియా. దీంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లు టాక్‌. ఈ క్రమంలో మాస్‌ మహారాజా రవితేజ, ఫరియాకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడట. తన తదుపరి చిత్రంలో ఫరియాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రవితేజ రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దర్శక నిర్మాతలతో రవితేజ చెప్పినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకు దర్శక నిర్మాతలు కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఫరియా అబ్దుల్లా కెరీర్‌కి ఇది సూపర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు.