మహనటి పెళ్ళి కూతురాయెనే?

దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతోంది మలయాళీ సోయగం కీర్తి సురేష్‌. ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి చెన్నై సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా ఆమెకు పెళ్లి జరిపించాలనే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. చెన్నైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో కీర్తి కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న సినిమా కమిట్‌మెంట్స్‌ కారణంగా మరో ఏడాది పాటు పెళ్లి వాయిదా వేయాలనే ఆలోచనలో కీర్తి సురేష్‌ ఉందట. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులతో చెప్పగా వారు ఏటూ తేల్చుకోని సందిగ్ధంలో ఉన్నారని సమాచారం. ఏదిఏమైనా కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దక్షిణాదిలో అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది కీర్తి సురేష్‌. ముఖ్యంగా ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకొని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉంది. తెలుగులో ‘గుడ్‌లక్‌ సఖీ’ ‘రంగ్‌దే’ ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది.