2020 సంవత్సరం సినీ ఇండస్ట్రీకి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రేక్షకులను ఎంతగానో అలరించి,వినోదాన్ని అందించిన కళామ్మతల్లి ముద్దుబిడ్డలు అనారోగ్యంతో కన్నుమూశారు. తమ నటనతో లెజండరీ నటులుగా గుర్తింపు పొందిన ఇండియన్ నటులు హఠాన్మరణం చెందడంతో ఇటు అభిమానులు అటు సెలబ్రిటీలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కరోనా ఇండస్ట్రీపై ప్రత్యేకంగా పగబట్టిందన్నట్టు ఎందరో స్టార్ నటీనటులని అనంత లోకాలకు తీసుకెళ్ళింది. కొందరిని రోడ్డున పడేసింది. ఈ విపత్కర కాలంలో ఇండస్ట్రీ చాలా గడ్డుకాలం ఎదుర్కొంది. మరి కొద్ది రోజులలో 2020 ముగుస్తున్న నేపథ్యంలో 2020లో లోకాన్ని వీడిన ప్రముఖులని ఒక్కసారి స్మరించుకుందాం.
కరోనా మహమ్మారి మన దేశంలో అడుగుపెట్టిన సమయంలో అంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ప్రతిఒక్కరిని షాక్‌కు గురిచేసింది. మంచి జీవితం ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా కన్నుమూయడం ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టించింది. సుశాంత్ సింగ్ మరణించిన కొద్ది రోజులకే బాలీవుడ్ లెజండరీ నటులు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా వలన అభిమానులకి వారిని చివరి చూపు చూసే అవకాశం కూడా దక్కలేదు.
ఇక ప్రముఖ లిరిసిస్ట్ అభిలాష్ సెప్టెంబర్ 28న అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. రఫ్తార్, అవారా లడకీ, సావన్ కో ఆనే దో వంటి సూపర్ హిట్ చిత్రాలకు లిరిసిస్ట్‌గా పని చేసిన అభిలాష్ 74 ఏళ్ల వయస్సులో కన్నుమూయడం అందరిని భాదించింది. ఇక లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఊహించని విధంగా కరోనాతో కన్నుమూశారు. ఆగస్ట్‌లో కరోనా బారిన పడ్డ బాలు కొన్ని రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. బాలు మృతి సంగీత పరిశ్రమకు తీరని లోటు.
కన్నడ కమెడీయన్ రాక్‌లైన్ సుధాకర్ సెప్టెంబర్ 23న గుండెపోటుతో కన్నుమూశారు. థియేటర్ ఆర్టిస్ట్, నటుడు భూపేష్ కుమార్ పాండ్య సెప్టెంబర్ 23న లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. విక్కీ డోనార్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ నటి ఆశాలత వాబ్‌గోనాకర్ సెప్టెంబర్ 22న కన్నుమూశారు. మలయాళం నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రభీష్ చక్కాలక్కల్ కొచ్చిలో సెప్టెంబర్ 14న మృతి చెందారు. తమిళ నటుడు ఫ్రోరెంట్ సీ పెరీయా సెప్టెంబర్ 14న చెన్నైలో కన్నుమూశారు. 2003లో వచ్చిన పుదియా గీతాయ్ చిత్రంతో ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చారు.
ప్రముఖ ఒడియా యాక్టర్ అజిత్ దాస్ సెప్టెంబర్ 13న తుదిశ్వాస విడిచారు. తమిళ నటుడు వడివేలు బాలాజీ సెప్టెంబర్ 10న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొలమావు కొకిల, పాండ్యం, సుట్టా పాజమ్ వంటి చిత్రాలతో ఆయన ఫేమస్. తెలుగు టీవీ నటి శ్రావణి కొండపల్లి సెప్టెంబర్ 8న తన ఇంట్లో సూసైడ్ చేసుకొని మృతి చెందింది. ఇక కామెడీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డి గుంటూరులోని తన ఇంట్లో సెప్టెంబర్ 8న గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఆయన తనదైన స్లాంగ్‌తో ప్రేక్షకులని అలరించాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ మోహిందర్ సెప్టెంబర్ 6న కన్నుమూశారు. 50,60 ల కాలంలో ఆయన చాలా ఫేమస్. ఇక ప్రముఖ అస్సామీ సింగర్ అర్చన మహంత ఆగస్ట్ 27న గౌహతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెటరన్ ఫిలిం మేకర్ ఏబీ రాజ్ ఆగస్ట్ 23న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 10 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన రాజ్ ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు.