ఇలియానా టాక్‌ షో

కరోనా పుణ్యమా అని డిజిటల్‌ మీడియాకి డిమాండ్‌ పెరిగింది. స్టార్‌ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్‌లో వెబ్‌ సీరీస్‌లతో పాటు టాక్‌ షోలకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. వాటిలో ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్లు చేసే టాక్‌ షోకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో టీవీ చానళ్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా పేరున్న హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్‌ షోని చేసింది.ఆ షోకి మంచి స్పందనే వచ్చింది. ఇక తమన్నాతో సైతం ఓ టాక్‌ షోకి ప్లాన్‌ చేస్తుంది ‘ఆహా’.

ఇదిలా ఉంటే ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమైందని సీనీ వర్గాల సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కోసం ఇలియానా ఓ టాక్‌ షో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. తొలుత ఓ సీజన్‌ని షూట్‌ చేసి విడుదల చేస్తారట. దానికి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి మరో సీజన్‌ని ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ టాక్‌ షో కోసం ఇలియానా భారీగానే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ టాక్‌షోని రూపొందించబోతున్నట్లు సమాచారం.