నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను

కమల్‌హాసన్‌ నట వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌‌గా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే ఆ మధ్యకాలంలో ప్రేమలో పడిన ఈ బ్యూటీ కొంతకాలం పాటు సినిమాలు పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో రొమాంటిక్ టూర్స్ వేసింది. ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక మెల్లగా అతనితో కట్ చేసుకున్న శృతి.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇదిలాఉంటే అందరిలాగే తనకు కూడా ఆర్ధిక ఇబ్బందుకున్నాయంటూ శృతి ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి హాసన్.. తనకూ ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెబుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సినిమా షూటింగ్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నా. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే షూటింగ్‌లో పాల్గొనాలి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో మాస్క్‌ లేకుండా షూటింగ్‌ చేయడం చాలా కష్టమే అయినప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల పనిచేయక తప్పదు. షూటింగ్స్‌ ప్రారంభించిన వెంటనే సెట్స్‌లోకి వెళ్లిపోతా అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

”నేను అమ్మానాన్నల మీద ఆధారపడటం లేదు. నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. నా ఖర్చులు నేనే సంపాదించుకుంటా. అందుకే పనిచేసి తీరాలి. నా పర్సనల్‌ లైఫ్‌, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు నేనే స్వయంగా తీసుకుంటా. ఈ కరోనా కారణంగా నష్టాల్లో ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చాలామంది స్మార్ట్‌ పీపుల్‌ చెబుతుంటారు. కానీ నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతాను” అని శృతి హాసన్ చెప్పింది.

అయితే ఉన్నట్టుండి శృతి ఈ ఆర్ధిక కష్టాల టాపిక్ ఎందుకు తీసుకొచ్చిందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఆమె చెప్పిన ఈ మాటలు విని కొందరైతే ‘ఇది చాలా ఓవర్.. ఓ స్టార్ హీరోయిన్ అయిన మీకే అన్ని కష్టాలుంటే మరి సాధారణ జనం పరిస్థితి ఏంటి?’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమాలో చిన్న రోల్ చేసిన శృతి.. ప్రస్తుతం ప్రభాస్ భారీ సినిమా ‘సలార్’లో హీరోయిన్‌గా నటిస్తోంది.