వర్మను ఆదేశించిన హైకోర్టు

ఇటీవల కాలంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించే అన్ని సినిమాలు వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నాయి. ఇటీవలే ‘మర్డర్‌’ సినిమాకు హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వగా.. తాజాగా ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమాను ఆపాలంటూ దిశ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోకముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.

అయితే ‘దిశ’ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో టీజర్ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతుండటంతోనే తాము కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ రామ్‌గోపాల్ వర్మను ఆదేశించింది. అసలు సినిమా నిర్మించేందుకు అనుమతులు ఉన్నాయో? లేదా? అన్నది తెలుసుకోవాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.

గతేడాది నవంబర్ 26వ తేదీన షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ సామూహిక హత్యాచారం, ఆపై నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనల ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు.