భావోద్వేగానికి గురైన మెగా హీరో

మెగా డాటర్, మిసెస్‌ ‌నిహారిక నేడు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో 28వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిహారికకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు కావడంతో మరింత ప్రత్యేకంగా మారింది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో వరుణ్‌తేజ్‌ చెల్లెలు నిహారికకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నిహా…నువ్వు ఇంత పెద్దదానివి అయ్యావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు ఎప్పటికీ మాకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతావు. నా జీవితంలో నువ్వు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ’..అంటూ ఎంతో ప్రేమగా నిహారికకు పుట్టినరోజు విషెస్‌ను తెలియజేశారు.

కాగా నిహారిక తన బర్త్‌డేను నేడు భర్త చైతన్యతో కలిసి ఫలక్‌నామ ప్యాలెస్‌లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఫలక్‌నామ ప్యాలెస్‌కు ఈ జంట చేరుకున్నట్లు సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు.

అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా కుటుంబమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో నిశ్చయ్‌ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.