పద్మభూషణ్‌గా  సుహాస్

ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. కనీస గుర్తింపు లేని నటులు కొందరు ఒక్కసారిగా తన సత్తా చూపించి స్టార్స్ అవుతారు. ఇప్పుడు కమెడియన్ సుహాస్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. చాయ్ బిస్కెట్ అంటూ డిజిటల్ మీడియాలో అడుగుపెట్టి.. చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. 2020లో కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. తన స్నేహితుడు సందీప్ రాజు దర్శకత్వంలో హీరోగా నటించాడు సుహాస్. ఈ సినిమాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు నిర్మాతలు అందరూ ప్రమోషన్ చేశారు. ఆహా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదలైన కలర్ ఫోటోకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత అవకాశాలు కూడా పెరిగాయి.

తాజాగా మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సుహాస్. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈయన కొత్త సినిమా పేరు రైటర్ పద్మభూషణ్. రైటింగ్ డన్ షూటింగ్ సూన్ అంటూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రైటర్ పద్మభూషణ్ పాత్రలో నటిస్తున్నాడు సుహాస్. ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో విషయం బాగానే ఉన్నట్టు అర్థం అవుతుంది. ఈ సినిమాతో మరో విజయం అందుకొని కచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడి పోవాలని కలలు కంటున్నాడు సుహాస్. హీరోగా నిలబడాలంటే బ్యాగ్రౌండ్ అవసరం లేదు కంటెంట్ ఉంటే చాలు అని నిరూపించే పనిలో ఉన్నాడు ఈయన. మరి కలర్ ఫోటో తీసుకొచ్చిన గుర్తింపుతో రైటర్ పద్మభూషణ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.