రైతులు తల్లిదండ్రులతో సమానం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. లాఠీ దెబ్బలకు వెరవకుండా, జల ఫిరంగులకు వెన్ను చూపకుండా, చలిని, ఆకలిని కూడా తట్టుకొని తమ పోరాటం కొనసాగిస్తున్నారు. రైతుల శాంతియుత పోరాటం దేశాన్ని కదిలిస్తోంది. అన్ని వర్గాల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతుగా పలువురు సెలబ్రిటీలు కేంద్రం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇస్తూ నిరసన తెలుపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో రియల్ హీరోగా అవతరించిన నటుడు

రైతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ సోనూసూద్ ఓ ట్వీట్ చేశారు. దేశంలోని రైతులు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానమని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు కన్న తల్లిదండ్రుల కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. సోనూసూద్ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు రైతులకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా రైతులకు మేలు చేసేవేనని మరి కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

రైతులతో కేంద్రం జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. రైతు సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చింది.