ఎవరు మీలో కోటీశ్వరులు కార్య‌క్ర‌మానికి బ్రేక్..నిరాశ‌లో ఎన్టీఆర్ అభిమానులు

ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఈయన బుల్లితెరపై కనిపిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో మరింత ఆలస్యంగా మొదలు కానుందని తెలుస్తుంది. తారక్ కు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసాడు. అది కాస్తా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ వచ్చేస్తున్నాడు తారక్. నాగార్జున ప్రోగ్రామ్ నే కాస్త మార్చి ఇది తీసుకొస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రోమోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ ఈ ప్రోమోను తెరకెక్కించడం విశేషం. జెమినీ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలని భావించారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ముందుగానే పూర్తి చేసుకున్నారు కానీ ఇప్పుడు అనివార్య కారణాలతో ఈ షోను జులైకి వాయిదా వేసారని తెలుస్తుంది. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ కూడా లేట్ అవుతుంది. అందుకే షో కూడా ఆలస్యంగానే మొదలు పెడుతున్నారు.

తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేసాడు జూనియర్. ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు తారక్. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు బయటికి వస్తుంది. కానీ ఇప్పుడు కూడా లేట్ అవుతుంది. ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలిక.