బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరని ప్రశ్నిస్తే …వెంటనే వచ్చే సమాధానం దీపికా పడుకోన్ అని. తన అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్నారు.ప్రతి వ్యక్తి జీవితంలో ఆటుపోట్లు అనేవి సహజం. వాటిని ఎదుర్కొని నిలబడ్డ వాళ్లు మాత్రమే లోకం గుర్తింపు పొందుతారు. అలాంటి కోవకు చెందిన నటే దీపికా. నేడు అగ్ర కథానాయికగా స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నప్పటికీ, ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టాక తొలి సినిమా సమయంలో తానెదుర్కొన్న అవమానాల్ని ఆమె బయటపెట్టారు. అసలు నటనకే పనికి రావని తనను ఛీత్కరించిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా పడుకోన్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. టీనేజ్ వయసు ముగుస్తున్న దశలో అంటే 19 ఏళ్లలో చిత్రసీమలో అడుగుపెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తొలి సినిమాలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడంతో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చారు. నిజానికి అప్పటికి తనకు నటన గురించి ఎలాంటి అవగాహన లేదన్న వాస్తవాన్ని అంగీకరించారు. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఫరాఖాన్, షారుఖ్‌ఖాన్ సలహాలతో సినిమాను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. కానీ సినిమా విడుదల తర్వాత తనపై విమర్శల దాడి జరిగిందన్నారు. తనకు నటన, డైలాగ్ చెప్పడం రాదన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. మోడలింగ్ నుంచి వచ్చిన తనను నటనకు పనికిరానని విమర్శించారన్నారు. సినిమాలో డైలాగ్‌లు చెప్పిన తీరు నవ్వు తెప్పించిందని అన్నవాళ్లు కూడా ఉన్నారన్నారు. ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు ఇక జీవితంలో సినిమాల్లో నటించకూడదనే విరక్తితో కూడిన భావన కలిగిందన్నారు. అయితే ఆ అవమానాల్ని సవాల్‌గా తీసుకొని, తనలోని లోపాలను సరిదిద్దుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కాలంలో విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకోవడం ఎంతో కిక్ ఇచ్చిందన్నారు.
