నీహారిక కి పెదనాన్న బహుమతి

మెగా వారింట పెళ్లి సంద‌డి షురూ అయింది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల‌ప‌ట్టి నిహారిక ఓ ఇంటికి కోడ‌లు కాబోతోంది. బుధ‌వారం(ఈ నెల 9న‌) జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో ఆమె మూడు ముళ్లు వేయించుకోనున్నారు. ఈ అపూర్వ ఘ‌ట్టానికి రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్ అతి సుంద‌రంగా ముస్తాబ‌వుతోంది. ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్ మిన‌హా మెగా కుటుంబ స‌భ్యులంతా సోమ‌వార‌మే రాజ‌స్తాన్ చేరుకున్నారు.

మ‌రోవైపు ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు జోరందుకున్నాయి. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి నిహారిక సంగీత్‌లో ఆనందంతో చిందులేస్తోంది. ఈ జంట‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేద‌ని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇదిలా వుంటే త‌న పిల్ల‌ల‌తోపాటు, త‌మ్ముడు, చెల్లెల పిల్ల‌ల‌ను కూడా స‌మానంగా చూసే చిరంజీవి కొత్త‌పెళ్లి కూతురు కోసం ఓ స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకున్నార‌ట‌.

పెళ్లికి ముందే ఆ ఖ‌రీదైన‌ బ‌హుమ‌తిని ఇచ్చేసిన‌ట్లు స‌మాచారం. రెండు కోట్ల రూపాయ‌లు విలువ చేసే ప్ర‌త్యేక‌ ఆభ‌ర‌ణాన్ని భార్య సురేఖ‌తో క‌లిసి నిహారిక‌కు అందించార‌ట‌. అలా నిహారిక మీదున్న కొండంత ప్రేమ‌ని చిరు కానుక‌తో చాటుకున్న‌ట్లు తెలుస్తోంది.