టాలీవుడ్ హీరోపై చీటింగ్ కేసు…షాక్ లో ఇండస్ట్రీ

టాలీవుడ్ లో చిన్న హీరోగా కొనసాగుతున్న విశ్వంత్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కేరింత, మనమంత, ఓ పిట్టకథ, తోలు బొమ్మలాట లాంటి సినిమాల్లో నటించిన విశ్వంత్.. తక్కువ ధరకు ఖరీదైన కార్లు ఇప్పిస్తానని మోసం చేసినట్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.హైదరాబాద్ లో ఉంటున్న వ్యాపారవేత్త రామకృష్ణ ఖరీదైన కారు కొనాలనుకున్నాడు. అతడికి 30శాతం తక్కువ ధరకే కారు ఇప్పిస్తానని విశ్వంత్ నమ్మించాడు. బంజారాహిల్స్ లోని ఓ ఇంటీరియర్ షోరూమ్ ఓనర్ తో తనకు పరిచయం ఉందని, అతడికి చెందిన కారును తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పాడు.విశ్వంత్ మాటలు నమ్మిన రామకృష్ణ అడ్వాన్స్ గా 10 లక్షలు చెల్లించాడు. నెల రోజుల తర్వాత మరో రెండున్నర లక్షలు ఇచ్చాడు. చెప్పినట్టుగానే కారును అందించాడు విశ్వంత్. అయితే ఆ కారును రామకృష్ణ పేరు మీద ట్రాన్సఫర్ చేయలేదు.ఓవైపు ఈ వివాదం నడుస్తుండగా, మరోవైపు అదే కారుపై 20 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు తేలింది. దీంతో తను మోసపోయానని గ్రహించిన రామకృష్ణ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్ష్మీకుమార్ పై చీటింగ్ కేసు పెట్టాడు. విశ్వంత్ పై చీటింగ్ కేసు నమోదైన విషయం నిజమేనని బంజారాహిల్స్ పోలీసులు ప్రకటించారు.