చరణ్ నాకు ఆ సలహా ఇచ్చాడు

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’‌. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామి సృష్టించి బ్లక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక హీరో, హీరోయిన్‌, దర్శకుడికి ‘ఉప్పెన’ తొలిసినిమా కావడం, ఇది రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టడంతో వీరి రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇక హీరోయిన్‌ కృతీ శేట్టి, హీరో వైష్ణవ్‌ తేజ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు సనాలకు మూవీ మేకర్స్‌ నుంచే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో బహుమతులు అందుతున్నాయి. ఇక మూవీ టీం సెక్సెస్‌ మీట్లలో పాల్గొంటూ ఫుల్‌ బీజీ అయిపోయింది.

ఈ కార్యక్రమాలకు హాజరవుతున్న టాప్‌ హీరోలు, దర్శకులంతా హీరోహీరోయిన్‌, దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో హీరో నటన చాలా బాగుందని, ముఖ్యం తన కళ్లు, కనుబోమ్మలతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటు వైష్ణవ్‌ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ్‌ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో మెగా హీరోలంతా తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణవ్‌ ఓ అసక్తికర విషయం చెప్పాడు. ‘ఉప్పెన’ మూవీ షూటింగ్‌ ప్రారంభించే ముందు బావ రామ్ చరణ్ తనకు ఓ సలహా ఇచ్చాడని వెల్లడించారు.

‘రామ్ చరణ్ అన్న మూవీలో నా కనుబొమ్మలను ఎంత వీలైత అంత ఉపయోగించమని చెప్పారన్నాడు. ఇలా చేస్తే మూవీలో నీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుందని, అది మూవీ సక్సెస్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పినట్లు వైష్ణవ్‌ వెల్లడించాడు. ఇక ఇటీవల ‘ఉప్పెన’ గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. వైష్ణవ్‌ను నాన్న బాబాయ్‌ సినిమాల్లోకి రమ్మని తరచూ ప్రోత్సహించారని చెప్పాడు. అంతేగాక నటనపై పట్టు సాధించేందుకు పవన్‌ కల్యాణ్‌ బాబాయ్‌ వైష్ణవ్‌ను విదేశాలకు పంపించాడని, నాన్న ఉప్పెన కథ నాలుగుసార్లు విన్నట్లు చరణ్‌ చెప్పుకొచ్చాడు.