‘నువ్వు ఏమంత కలర్‌ లేవు’ అనేవారు

చాందిని చౌదరి.. ఒకప్పడు యూట్యూబ్‌ స్టార్‌గా రాణించిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదిగింది. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బ్రహ్మోత్సవం, లై వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఆమె హీరోయిన్‌గా నటించిన ‘కలర్‌ ఫొటో’ మూవీ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైంది. అయినప్పటికి ఈ మూవీ పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుని సక్సెస్‌ బాట పట్టింది.

అంతేగాక ఇందులో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. అదే సమయంలో ఈ మూవీతో పాటు ఆమె తొలిసారి హీరోయిన్‌గా నటించిన ‘సూపర్‌ ఓవర్‌’ చిత్రంలో కూడా ఓటీటీలోనే విడుదలైంది. రెండు ఒకే సమయంలో వచ్చినప్పటికి చాందినికి కలర్‌ ఫొటో మూవీయే మంచి విజయాన్ని అందించింది. అంతేగాక హీరోయిన్‌గా కూడా ఈ మూవీ గుర్తింపును ఇచ్చింది.

అంతటి సక్సెస్‌ను అందుకున్న ఈ భామ పలు ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తూ గతేడాదిఫుల్‌ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చాందిని మాట్లాడుతూ.. ‘ఇక్కడ తెలుగు హీరోయిన్స్‌, బయటి హీరోయిన్స్‌ కంటే రెట్టింపు కష్టపడాలి. అయినా వారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదు.

నేను కనీసం కొన్ని సినిమాల్లోనైన నటించగలిగాను, నా కంటే ముందుగా పరిశ్రమకు వచ్చి ఇంకా అవకాశాలు దొరకని వారున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగమ్మాయిలు అవకాశాల కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. కేరీర్‌ ప్రారంభంలో ఏమైనా వివక్షకు గురయ్యారా అని అడగ్గా.. ‘ప్రస్తుతానికైతే నాకు నటిగా, హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. ఇంకా అవకాశాలు లేక వివక్షకు గురవుతున్నవారు మీ ప్రశ్నకు సరైనా సమాధానం ఇవ్వగలరనుకుంటున్నా’ అంటూ వివరించింది. అయితే హీరోయిన్‌ అయ్యాక మాత్రం కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని, బయట హీరోయిన్స్‌తో పోలుస్తూ తనని ‘నువ్వు ఏమంత కలర్‌ లేవు’ అంటూ విమర్శించేవారని వెల్లడించింది. అంతేగాక ఇప్పటికి సమాజంలో వర్ణ వివక్ష ఉండడం చూసి ఆశ్చర్యం వేసిందని ఆమె పేర్కొంది.